పకడ్బందీ ప్రణాళికతో కరోనా రెండో దశ వ్యాప్తి
ని నియంత్రించడానికి కృషి చేయాలి : మంత్రి శ్రీ కేటీఆర్
రాబోయే రెండు వారాలు అత్యంత కీలకం.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
లాక్ డౌన్ నియమాలను ప్రజలందరూ పాటించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి.
క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లకు తమ సేవలను అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రశంస
జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతూ కరోనా రెండో దశ వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కె. తారకరామారావు పేర్కొన్నారు.

కరోనా రెండో దశ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రులలో అందించాల్సిన మెరుగైన వైద్యం, తదితర అంశాలపై మంత్రి చర్చించి, కలెక్టర్ కు పలు సూచనలు చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. ఆయా ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నటువంటి పడకలు, ఆక్సిజన్ నిర్వహణ, పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ లభ్యత, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్రణాళికతో, ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, స్వీయ నియంత్రణనే శ్రీరామరక్ష అని, అత్యవసరమైతెనే ప్రభుత్వం సూచించిన నిర్దేశిత సమయంలో ప్రజలు బయటికి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ టీకాలు వేయడం పూర్తయిందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో టీకాలు తీసుకున్న వారందరూ రెండో దశ టీకాలను తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ఈ ఇంటింటి జ్వర సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరం అవుతుందని తెలిపారు.
జిల్లాలో రోజువారీగా పరిస్థితిని తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ కరోనా రెండో దశ వ్యాధి వ్యాప్తి కట్టడి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించి తోడ్పాటు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.