Noted Bollywood Actor Sri Sonu Sood met Minister Sri KTR in Hyderabad today. During the meeting, Minister appreciated Mr. Sonu Sood for his social service activities, especially during the #Covid pandemic.

తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు శ్రీ సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోను సూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు.
ఈ సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం సోనూసూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.